Prathyaksha Daivamu    Chapters    Last Page

1. ఆదిశంకరులు - శ్రీ కంచి కామకోటి పీఠము

'శివరహస్యం'లో పరమశివుడు తాను చెప్పినట్లు 'శంకరులు'గా నవతరించెను. కలియుగారంభమునకు సుమారు రెండువేల సం||ల అనంతరం కేరళలోని 'కాలడి'లో ఆయన అంశావతారమెత్తారు. తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురువు. వైదికమత పునరుద్ధరణంచేసి భావిసంతతి ననుగ్రహించడమే వీరి అవతార ప్రయోజనం.

అయిదోయేట వుపనయనం కాగానే బ్రహ్మచర్యాశ్రమానుసారం వారొక దినమున భిక్షకై బయలుదేరి ఒక యింటిముందు నిలిచారు. అది పేద దంపతుల గృహం. యజమాని యింట్లో లేడు-ఇల్లాలుమాత్రం వుంది. ఆ వటువుకు భిక్ష పెట్టడానికి ఇంట్లో యేమీ లేకపోవడంతో ఆమె చాలా బాధపడుతోంది. చాలాసేపు వెదికితే, బాగా యెండిన ఉసిరికాయ (నెల్లికాయ) ఒకటి కన్పించింది. దాన్నే సభక్తికంగా ఆమె శంకరుల కర్పించింది. ఆ దంపతుల పేదరికాన్ని అర్థంచేసుకున్న శంకరులు 'కనకధారాస్తవం'తో శ్రీమహాలక్ష్మిని కీర్తించారు. ఫలితంగా దేవి ప్రసన్నమై ఆ యింట కనకామలక వర్షం కురిపించింది.

తర్వాత ఎనిమిదో యేడు వచ్చేటప్పటికే శంకరులు వేదశాస్త్రాలన్నీ అభ్యసించి, వృద్ధురాలైన తన తల్లికి పరిచర్య చేస్తూ వుంటారు. ఒకనాడు తల్లితో శంకరులు 'పూర్ణా' నదీ స్నానానికి వెళ్ళి, నీళ్ళల్లో దిగగానే ఒక మొసలి ఆయన కాలిని పట్టుకొంటుంది. ఆక్లిష్టపరిస్థితిలో ఆయన తన తల్లి అనుమతిపై సన్యసిస్తారు. వెంటనే మొసలి పట్టు వీడిపోతుంది. నదినుండి బయటకు వచ్చి శంకరులు తల్లివద్ద సెలవు తీసుకొని సన్యాసిగా పర్యటనం సాగిస్తారు.

నర్మాదానదీ తీరంలో తపస్సులో వున్న శ్రీ గోవింద భగవత్పాదులను సందర్శించి, వారికి శిష్యులై మహావాక్య చతుష్టయ తాత్పర్యాన్ని బోధించుకొని, వారి ఆశీర్వాదాన్ని పొందుతారు. అప్పట్నుంచే వారికి శ్రీ శంకరాచార్యులని ప్రసిద్ధి కల్గింది. గురువుగారి ఆజ్ఞ మేరకు శ్రీ శంకరులు కాశీకి వెళ్ళారు. ప్రతి నిత్యమూ గంగా స్నానం చేసుకొని, అన్నపూర్ణా విశ్వేశ్వరులను దర్శించేవారు. వేదవ్యాస విరచిత ప్రస్థాన త్రయానికి అంటే బ్రహ్మసూత్రాలకూ, భగవద్గీతకూ, ఉపనిషత్తులకూ భాష్యాలు వ్రాశారు. అనంతరం అక్కణ్ణుంచి నర నారాయణులు తపస్సు చేసిన బదరికాశ్రమం చేరుకొన్నారు శంకరులు. అక్కడొక వింత జరిగింది.

గంగ కావలివైపున్న సదానందు డనే శిష్యుణ్ణి మడిబట్టలు తీసుకు రమ్మని పిల్చారు ఆచార్యులు. సదానందుడు మహా గురుభక్తి సంపన్నుడు కాబట్టి, గంగాప్రవాహజలంపై పరుగెత్తుతూ ఈవలి ఒడ్డునవున్న గురువుగారిని చేరుకొంటాడు. అలా వస్తున్నప్పుడు ఆయన నీళ్ళల్లో పడిపోకుండా, నీటిపై తామరపూలు అడుగడుగునా మొలిచి నిలిచాయట. అందుకని అతనికి ''పద్మపాదు'' డని పేరు వచ్చింది.

బదరికాశ్రమంలో శ్రీ శంకరులు యోగశక్తిచే బదరీ నారాయణుని విగ్రహాన్నీ, నారాయణ కుండాన్నీ కనుక్కొని అక్కడనే దేవాలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. ప్రచ్ఛన్న (మాఱు) వేషధారియైన వేదవ్యాసునితో దీర్ఘకాలం శాస్త్ర చర్చలు సాగిస్తారు. అప్పుడు వీరికి పదహారేళ్ళు. వేదవ్యాసుడు మెచ్చుకొని మరో పదహారేళ్ళ ఆయుస్సును శంకరులకు ప్రసాదిస్తాడు.

తరువాత శంకరులు కేదారనాధ్‌ సందర్శించి తన భౌతిక కాయాన్ని అక్కడే వుంచి, దివ్య శరీరంతో కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి పూజించి పంచ స్ఫటిక లింగాలతో పాటు, మంత్రభాగము మరియు ఆపాదమస్తకాంత వర్ణన వున్న సౌందర్యలహరిని అక్కణ్ణుంచి తెస్తుంటే, నందికేశ్వరు లాయనకు అడ్డు తగిలి, ఆచార్యులవారి చేతిలోంచి సౌందర్యలహరిని లాక్కున్నారు. అందులో మంత్రభాగం 41 శ్లోకాలు మాత్రం ఆచార్యులవారికి దక్కాయి. వర్ణనా భాగం 59 శ్లోకాలు నందికేశ్వరుల చేతుల్లో నిలిచిపోయాయి. లుప్తభాగాన్ని భగత్పాదులవారు పూరించారు. తిరిగి కేదారనాథ్‌లో వున్న తన భౌతిక శరీరంలో ప్రవేశించిన అనంతరం అనేక దివ్య స్థలాలు దర్శించి బహు ప్రదేశాల్లో దేవాలయాల్ని ప్రతిష్ఠింపజేస్తారు శ్రీ శంకరులు. అంతేగాక స్థల మాహాత్మ్యాలకు తగ్గట్టు చాలా దేవతాస్తుతులను విరచిస్తారు.

ప్రయాగలోని కుమారిల భట్టును గలసి, ఆయన ఆదేశానుసారం మండన మిశ్రునితో శాస్త్రచర్చ జయిస్తారు శంకరులు. మండన మిశ్రుని యిల్లాలు సరసవాణిని వాగ్వాదంలో గెలిచి, ఆమెను శారదాదేవిగా రూపొందింపజేసి, తుంగభద్రానదియొడ్డుననున్న శృంగేరిలో ఆమెను ప్రతిష్ఠిస్తారు. ఆమెకు నిత్యార్చన జరుగుటకై శారదా పీఠాన్ని స్థాపిస్తారు.

శృంగేరిని వదలి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తారు. పవిత్ర బదరీనాథంలో జ్యోతిర్మఠాన్నీ, పూరీ జగన్నాథాల్లో మరో రెండు పీఠాలనూ స్థాపిస్తారు. తరువాత నేపాళ##దేశం వెళ్ళి పశుపతినాథాలయాన్ని దర్శించి అచట దక్షిణాచార విధానంతో పూజాదికాలు జరిగేటట్లు ఏర్పాటుచేస్తారు. బదరీనాథంలో గూడా ఇదే పద్ధతి కొనసాగిస్తారు. ఇప్పటికీ కేరళ నంబూద్రి బ్రాహ్మణులే అచ్చట అర్చకులు.

శంకరులు తమ దక్షిణదేశ యాత్రలో తిరుచిరాపల్లి సమీపంలో జంబుకేశ్వరం (తిరువానైక్కావల్‌) వెళ్ళి అక్కడ అశిలాండేశ్వరికి శ్రీ చక్కాంకితాలైన తాటంకాలు(చెవికమ్మలు) అలంకరిస్తారు. చివరగా కంచి చేరుకుంటారు.

కాంచీనగరం మోక్షదాయకములైన సప్తపురాలలో ఒకటి. అచట వారు వరదరాజ స్వామిని, ఏకామ్రేశ్వరుని, శ్రీ కామాక్షీ దేవిని సందర్శిస్తారు. అమ్మవారి ఆలయాన్ని సముద్ధరించిన అనంతరం కుంభాభిషేకం చేస్తారు. వేదవిరుద్ధభావాలను నిర్మూలనంచేసి, అచటి పండిత ప్రకాండుల నోడించి ''సర్వజ్ఞ'' పీఠాన్ని అధిష్ఠిస్తారు. కామకోటిపీఠాన్ని అధిష్ఠించిన అనంతరం తాను కైలాసంనుంచి తెచ్చిన పంచస్ఫటిక లింగాల్లో ఒకటైన యోగలింగానికి అర్చనాదికాలు చేస్తారు.

కొంతకాలానికి శరీరత్యాగం చెయ్యదలచి ఆచార్యులు కామాక్షీ అమ్మవారి దేవాలయం వెనుకవైపు సిద్ధాసనస్థులై పంచేంద్రియాలను మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో లయంచేసి విదేహ ముక్తిని పొందుతారు.

ఇలాంటి మహోన్నత కంచి కామకోటి పీఠాన్ని అలంకరించిన మహాత్ముల పరంపర ఆధ్యాత్మిక వైభవాన్ని పరిపూర్ణంగా వెలయిస్తూ వచ్చింది. 'ఇంద్ర సరస్వతి' అనునది ఈ పీఠాధిపతులకు బిరుదనామము. శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు దీనికి 68 వ ఆచార్యులు కాగా, 69 వ ఆచార్యులుగా శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారున్నారు. వీరికి వారసులుగా 70 వ ఆచార్య స్థానాన్ని శ్రీశ్రీశ్రీ శంకరానందేంద్ర సరస్వతీ స్వామివారు అలంకరించి ప్రస్తుతము 68 వ ఆచార్యుల వారినుండి వేదదీక్షాదికాలు స్వీకరిస్తున్నారు.

శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు

జగద్గురువులుగా ప్రపంచ ప్రఖ్యాతి నందిన మహా తపో మూర్తులు. నడయాడుతున్న దైవం వీరే. 'సాధూనాం శ్రవణం (దర్శనం) పుణ్యమ్‌' కాబట్టి ఇట్టి పుణ్యతమ మూర్తుల ఆదర్శ జీవితాన్ని రేఖామాత్రంగా పరికిస్తాం.

'శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి' అనునది సన్యాసమును స్వీకరించిన స్వామినాథను పేరు. వీరు 1894 మే నెల 20 వ తారీఖున దక్షిణార్కాటు జిల్లా యందలి విల్లుపురమున హొయసల కన్నడ స్మార్త బ్రాహ్మణ కుటుంబమునకు చెందిన సుబ్రహ్మణ్య శాస్త్రి, మహాలక్ష్మీ దంపతులకు పుణ్య ఫలముగా రెండవ సంతాన మయ్యాడు. స్వామిమలైలో నున్న 'స్వామినాథను' వీరి కుటుంబానికి ఆరాధ్యదైవం కాబట్టి ఆ పేరే స్వామినాథనుకు పెట్టబడింది. వీరి కుటుంబం తమిళ దేశానికి వలస పోయారు చాలా కాలం క్రిందటనే. సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తొలుత ఉపాధ్యాయులుగా నుండి తర్వాత విద్యాశాఖలో పనిచేశారు.

పిల్లి నేర్పిన పాఠం

స్వామినాథన్‌ను ఆధ్యాత్మిక మార్గంగా ఆలోచింపజేసిన మొట్ట మొదటి సన్ని వేశమిది. సన్న మూతి గల యొక రాగిపాత్రలో బెల్లముంచి పుట్టిమీద పెట్టారు. చీకట్లో ఓ పిల్లి మెల్లగా వచ్చి దాన్లో తల దూర్చి, దభీమని పాత్రతో గూడా క్రిందపడి, తల విదిలించుకొనే ప్రయత్నంలో చప్పుళ్ళు చేస్తూ వుంది. ఈ చప్పుళ్ళు విని, ఎవరో దొంగలు పడ్డారని ఆందోళనతో తలా ఒక కఱ్ఱ తీసుకొని జనం పోగయ్యారు. తలుపు తీసి చూస్తే ఏముంది! పిల్లి, దాని యవస్థ - కన్నులకు గట్టినవి. దానికి త్రాడు కట్టి ఒక స్తంభానికి దాన్ని కట్టేశారు. అనుభవశాలురు కొంతసేపు పెనగులాడి దాని తల నుండి రాగి పాత్రను లాగేశారు. పాపం ఆ పిల్లి చావుబ్రతుకుల్లో వుంది. పేరాశ చేత తాను భయంకర పరిస్థితుల్లో చిక్కి, పరిసరాల వాళ్ళకు నిద్ర లేకుండా చేసి రాత్రినంతా ఆదుర్దాగా గడిచేటట్లు చేసింది మార్జాలం. కాదు కాదు- దాని లోభగుణం. రెండో సంఘటన-

పొన్నుస్వామి చేసిన మోసం

స్వామి బాల్యంలో ఓరోజు తానొక్కడే ఇంట్లో వుండాగా వీధి వెంట బోవు వాడెవడో వచ్చి స్వామినాథను బంగారు మురుగులపై చేయి వేశాడు. 'ఇవి వదులుగా వున్నాయి, కొక్కీలు గట్టిగా బిగించి సరిచేసి తీసుకురా' అని సాధికారంగా చెప్పాడు స్వామినాథన్‌. చేయివేసినవాడు 'సరేన'ని వినయం నటించి బంగారం తీసుకెళ్ళి పోయాడు. పెద్దలు ఇంటికి రావటం తోటే విషమంతా చెప్పి ''పొన్నుస్వామి''కి నగలు బాగుచెయ్యటానికి యిచ్చానన్నారు స్వామి. వెంటనే వారు ఆదుర్దాతో దొంగకోసం వెదకి వెదకి విఫలు లయ్యారు. అప్పుడు మన స్వామి ''వాని పేరు పొన్నుస్వామి, నా బంగారు నగలకు గూడా అతడే స్వామి అయినాడు'' అని స్థితప్రజ్ఞుడై జవాబిచ్చాడు. (పొన్ను - అంటే తమిళంలో 'బంగారం' అని అర్థం).

ఒకటి నుండి మూడో క్లాసుకు

1900 వ సంవత్సరం స్వామినాథన్‌ చిదంబరంలో ఒకటో తరగతి చదివే రోజుల్లో శ్రీ యం. సింగారవేలు మొదలియారనే ఉప పరీక్షాధికారి వారి స్కూలుకు వెళ్ళారు. స్వామినాథను మహా ప్రతిభాశాలి అని గుర్తించి, పై తరగతులకు నిర్ణయింపబడిన లాంగ్మను ఆంగ్ల వాచకాన్ని తెప్పించి చదువుమన్నారు. స్వామినాథను ఆశ్చర్య జనకంగా చాలా చక్కగా చదివాడు. తత్ఫలితంగా ఒకటినుండి నేరుగా మూడో తరగతికి పంపబడ్డాడు.

ఆంగ్ల భాషా నైపుణ్యం

1906 లో స్వామినాథన్‌ 9వ తరగతి చదివే రోజుల్లో షేక్స్‌పియర్‌ రచించిన 'కింగ్‌ జాన్‌' అనే సంభాషణాత్మక ప్రదర్శన యేర్పాటు చేయ దలచారు. యువరాజు 'ఆర్థర్‌' అనే ముఖ్య పాత్రకు ఎవరు తగుదురా? అని ఆలోచిస్తుంటే ప్రధానోపాధ్యాయునికి స్వామినాథనుని అసాధారణ ప్రజ్ఞా పాటవాలు తెలియడంతో ఆయననే నిర్ణయిస్తారు. పండ్రెండేండ్ల స్వామినాథన్‌ తల్లిదండ్రుల ఆజ్ఞపై ఆ పాత్రను కేవలం రెండే రెండు రోజుల్లో నేర్చుకొని పరమాద్భుతంగా, ప్రేక్షక జన శ్లాఘాపాత్రంగా ప్రదర్శించారు. సంభాషణా చాతుర్యంలోనూ, నటనా కౌశలంలోనూ, ఆంగ్లోచ్ఛారణా దక్షతలోనూ అనన్య సామాన్యమైన ఆయన ప్రతిభ##నే అందరూ దర్శించి వారి తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని కలసి కుమారుని యోగ్యతను వేనోళ్ళ శ్లాఘించారు.

ఉపనయన దీక్ష

ఉద్యోగరీత్యా, సుబ్రహ్మణ్య శాస్త్రి 'దిండి వనం' బదలీ కావడంతో అక్కడే 1906 లో స్వామినాథనుకు ఉపనయనం జరుగుతుంది. శ్రీ కామకోటి పీఠానికి 66 వ ఆచార్యులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు నూత్న వటువుకు ఆశీస్సు లందించారు. తన తరువాత కామకోటి పీఠానికి స్వామినాథుడే వారసుడని గూడా వాకొన్నారు. ఆశ్రమ స్వీకారానంతరం వారి పేరునే స్వామినాథను గూడా ధరించారు. ఇది గణనీయ విషయం.

శ్రీ కామకోటి పీఠాధిపత్యం

స్వామినాథను మహోన్నత పవిత్ర కాంచీ పీఠాధిపత్యాన్ని స్వీకారించడానికి తంతి మూలంగా తండ్రియాజ్ఞ లభించింది. వెంటనే ఆ పట్టాభిషేక మహోత్సవానికి కావలసిన సంభారాన్నీ సమకూర్చ బడినాయి. 1907 వ సం|| ఫిబ్రవరి 13వ తేదీన స్వామినాథను శ్రీ కంచి కామకోటి పీఠానికి 68 వ ఆచార్యులయ్యారు. అప్పటినుండి తనకు పూర్వాచార్యులైన 'శ్రీ చంద్రశేఖర' నామానికి 'ఇంద్ర సరస్వతి' అనే పీఠబిరుద నామాన్ని జోడించి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామిగా విశ్వవిఖ్యాతి నార్జించారు.

కుంభకోణ ప్రయాణం

18వ శతాబ్దిలో 62వ ఆచార్యుల కాలంలో యేర్పడిన రాజకీయ అశాంతివల్ల పీఠ ముఖ్యస్థానం కంచి నుండి కుంభకోణానికి మార్చబడింది. అందుకని పీఠ వ్యవహారాలు గమనించాలని స్వామి కుంభకోణం బయలుదేరారు.

కాలగతిగా పీఠ కార్యక్రమాలూ, బాధ్యతలూ పెరుగజొచ్చాయి. ఇప్పుడీ సంస్థ మఠ మాత్రముననే పరిమితం కాలేదు. ఆస్తికుల వితరణవలన లభించిన ఆస్తిపాస్తులు చూచుకోవాలి. మత ధర్మ కార్యక్రమాలు నిర్వహించాలి. అట్టి సంస్థకు అధిపతి కావడం సామాన్య విషయం కాదు. ఆధ్యాత్మిక శక్తి సంపన్నత, లౌకిక వ్యవహార దక్షత లేనిదే ఈ యాజమాన్యము సుసాధ్యం కాదు. జగద్గురుత్వంతో పాటు వ్యక్తులనూ, పరిస్థితులనూ సుసూక్ష్మాంగా పరిశీలింపగల నైపుణ్యమూ కావాలి.

1835 నుండి ఏబది సంవత్సరాలకు పైగా ఈ పీఠాన్ని స్వామినాథను పితామహులైన గణపతి శాస్త్రిగారు నిర్వహించారట. వీరిపరిపాలనా దక్షతల వల్లనే పీఠాని కవసరమయ్యే ఖర్చులకు తగిన ఆధారాలు సుస్థిరంగా యేర్పాటు చెయ్యబడ్డాయి. నాటి నుండీ మఠ బాధ్యతలు విస్తృతంగా పెరిగాయి. ఇందుకొరకే స్వామి మొట్ట మొదట పీఠానికి కేంద్ర స్థానమైన కుంభకోణం వెళ్ళాల్సి వచ్చింది.

మధ్యలో మూడు రోజులు 'దిండి వనం'లో ఆగారు శ్రీ స్వామి. అతః పూర్వం తమ మధ్య చిన్నిపిల్లవాడుగా తిరిగిన ఇతడు మహత్తర కాంచీ పీఠాధిపతిగా దర్శనమిచ్చెనన్న దిండివన పౌరుల కెంత గర్వ కారణము! ఎంత ఆనందదాయకము! ఆ పట్టణము మహోత్సవ రూపిణియైనది.

తాను చదువుకొన్న అమెరికన్‌ మిషన్‌ పాఠశాలా ధ్యాపకులును, విద్యార్థులును స్వామి దర్శన సంభాషణలతో ఎంతో గర్వోన్నతులయ్యారు. ఉపాధ్యాయులతో మధురాలాపాలు, ఇతరులతో శుభ వాక్యాలు నెరపిన స్వామి తిరిగి కుంభకోణ యాత్ర సాగించారు.

పట్టాభిషేక వైభవం

పీఠాధిపతి అంటే శిష్యకోటి దృష్టిలో ఒక ఆధ్యాత్మిక సమ్రాట్టు. రాచరిక మర్యాదలు, చిహ్నములు, వైభవాలూ అన్ని వుంటాయి. క్రొత్త స్వామి పీఠాధిపత్య పట్టాభిషేక మహోత్సవాన్ని వైభవంగా శిష్యులు చేయదలచారు. కుంభకోణ మఠంలో 1907 మే నెల 9వ తేదీ గురువారం నాడు పట్టాభిషేకం మహా వైభవంగా జరిగింది. తంజావూరు పాలకుడైన శివాజీ కుటుంబంలోని రాణులు జీజాంబాభాయి సాహెబ, రామకుమారాంబా భాయి సాహెబ గారలు పట్టాభిషేకానికి కావలసిన సంభారాలన్నీ పంపారు. పట్టాభిషేక మహోత్సవానంతరం స్వామి అనుగ్రహ వాక్యాలు పలికారు. ఆ రాత్రి శ్రీ స్వామివారిని బంగారపు టంబారీలో తంజావూరు పాలకు లంపిన రాచనాగము (ఏనుగు)పై ప్రధాన వీధులలో ఊరేగించారు. దీనితో జగద్గురువుగా శ్రీ ఆచార్యస్వామివారి ఆధ్యాత్మిక ప్రభుత్వ మారంభ##మైనది.

ప్రథమ విజయ యాత్ర

విజయయాత్ర లంటే ఆచార్య స్వామి దేశం నలుమూలలకూ జరిపే యాత్రలు. పీఠ దైవతాలైన చంద్రమౌళీశ్వర త్రిపురసుందరీ దేవులకు జరిగే నిత్య పూజా కార్యక్రమాల్లో ప్రజలు శక్త్యానుసారం పాల్గొనడానికి, పీఠ స్వాముల తీర్థప్రసాదాల నందుకొని తరించడానికి, స్వామి వారి ఆదేశాలనూ, వేదాంత ప్రసంగాలనూ విని తన్మూలంగా ఆధ్యాత్మిక జ్ఞానార్జనకూ, జీవితంలో తగిన శిక్షణను పొందడానికీ ఈ యాత్రలు వుద్దేశింపబడినాయి. ఆచార్య స్వామి పర్యటించిన యెల్లచోట్లా వారి సమక్షంలో ప్రజానీకం సంపూర్ణ లాభం పొందుతారు. మహోత్సవంగా దానిని చేసుకుంటారు. ఎదను కదలించి జీవుని నిద్ర లేపు స్వామి ప్రసంగాలను తన్మయులై వింటారు. ఉన్న ఉనికిలోనే ఉన్నత స్థితి నందినట్లు భావిస్తారు.

ఈ లక్ష్యంతో 1908లో దిగ్విజయ యాత్ర ప్రథమంగా జంబుకేశ్వరరానికి (తిరువానైక్కావల్‌కు) ప్రారంభమయింది. ఇచ్చటనే అఖిలాండేశ్వరీ దేనికి ఆదిశంకరులు స్వయంగా శ్రీ చక్రాంకితాలైన తాటంకాలు (చెవికమ్మలు) అలంకరించారు. జీర్ణోద్ధరణ అనంతరం 1908లో ఈ ఆలయానికి కుంభాభిషేకం కూడా చేశారు శ్రీ స్వామి, 1909లో కుంభకోణంలో పండ్రెండేళ్ళ కొకసారి జరిగే మహామఖాన్ని నిర్వహించారు.

విద్యా శిక్షణలు

1909 నాటికి స్వామివారికి పదునైదేండ్లు. కుంభకోణంలోనే మఠ పండితులు రెండేళ్ళ పాటు సంస్కృత కావ్యాలను బోధించారు. వీరి విద్యాభ్యాసానికై ప్రశాంత వాతావరణం కావాలని అఖండ కావేరికి ఉత్తర తీరంలో ఒక పర్ణశాల నిర్మించారు. 1911 నుండి 1914 వరకు ఆచార్య స్వామి అచ్చట విద్యాభ్యాసాన్నీ, వలసిన శిక్షణను స్వీకరించారు. బోధకులు మఠ శిష్యులు - బోధ్యులు మఠ గురువులు అయినను స్వామి, సంపూర్ణ పరిగణనంతోనూ, గౌరవంతోనూ వారి శిక్షణను స్వీకరించారు. వా రుభయులు తమ కది అనన్య గౌరవంగా సంభావించారు.

సంగీత శాస్త్రజ్ఞు లెవ్వరైనా వచ్చినచో వారితో సంభాషిస్తూ గానకళలో నైపుణ్యాన్నీ, అనుభవాన్నీ పెంపొందించుటకు స్వామి వారా అవకాశాన్ని వినియోగించే వారు. ప్రకృతి సౌందర్య వైభవ పులకితులగుటకై, ఎడప దడప కావేరీ ద్వీపాలకు వెళ్ళేవారు. ఛాయా చిత్రాకారులు (Photographers) గూడా అచటి పరిసరాల్లోని సౌందర్యాలను సేకరించడానికి వెళ్తుంటారు. ఈకళలో గూడా స్వామి కభి నివేశం వుంది. అంతే కాకుండా ఖగోళ శాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలోనూ కూడా చక్కని పరిచయం కలవారు శ్రీ స్వామి.

విజ్ఞాన సర్వస్వము - శ్రీ స్వామి

1914లో ఆచార్య స్వామి కుంభకోణ మఠానికి మరలి వచ్చారు. అప్పటికి స్వామి కిరువదేండ్లు. ఆ వయసుకే వారొక విజ్ఞాన సర్వస్వము. పండితు లెవరైనా వారివద్దకు వెళ్ళితే, వారివారి అభిమాన శాస్త్రాల్లో లోతైన ప్రశ్నలను వేసి విషయావగాహన చేసేవారు. కుంభకోణంలో విద్యాభ్యాస కాలంలో వారు 'గంగైకొండ చోళ' పురానికి పోయి అచటి శాసనాలను తిలకించుట, దేవాలయ వాస్తు కళా పరిచయం చేసికొనుట ఒక పనిగా పెట్టుకొన్నారు. ఇలాగా స్వామివారు సర్వజ్ఞత్వానికీ, కామకోటి పీఠాధిపత్యానికీ కావలసిన శక్తి సామర్థ్యాలను బహు ముఖంగా సంతరించుకొన్నారు.

స్వామికి పీఠ వ్యవహార నిర్వహణ యోగ్య వయస్సు రాకుండుటచే 1911 నుండి 1915 వరకు పీఠాన్ని వార్డుల పర్యవేక్షణలో నడుపుతుండేవారు. 1915 మే 21వ తేదీకి స్వామికి ఇరువదొక్కయేడు దాటింది. అప్పట్నుంచి పీఠ వ్యవహారాల నిర్వహణ మాత్రం నియమితులైన ఉద్యోగులూ, కార్యకర్తలూ చేస్తుండే వారు. పీఠ నియమితుల కిచ్చే ఆజ్ఞా పత్రాలపై పీఠ ముద్ర మాత్రమే వుంటుంది గాని, చేవ్రాలుండదు.

ఆ యేడు శంకర జయంత్యుత్సవాలు పెద్ద యెత్తున జరిగాయి. మఠ యాజమాన్యములో 'ఆర్య ధర్మ' అనే సంచిక వెలువడింది. 1916 అక్టోబరులో నవ రాత్ర్యుత్సవాలు దేదీప్యమానంగా నూత్న శోభతో మఠంలో నిర్వహింప బడ్డాయి. 'సుబ్రహ్మణ్య భారతి' అనే సుప్రసిద్ధ కవి స్వామివారిని శ్లాఘిస్తూ ఒక అమూల్య వ్యాసం వ్రాశారు.

జగద్గురుమూర్తి

ప్రాచీన విద్యాభ్యుద్ధరణానికీ, సాంఘిక సంక్షేమానికీ శ్రీ స్వామి ప్రారంభించిన తొలి కార్యక్రమాలు చాలా వరకు ఫలవంతములయ్యాయి. 'శాస్త్ర రత్నాకర' మొదలైన బిరుదులతో విఖ్యాత పండితోత్తములు గౌరవింప బడ్డారు. పాఠశాల మరియు కళాశాలా విద్యార్థులకు హిందూ ధర్మ విషయిక వ్యాస రచనలో పోటీలు నిర్వహింప బడ్డాయి. యోగ్య విద్యార్థులకు ఉపకార వేతనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మఠంలో ఉచిత ఆయుర్వేద వైద్యశాల నెలకొల్ప బడింది.

1914-18 మధ్యలో శ్రీ స్వామి కుంభకోణంలో వున్నప్పుడు ప్రతి దినము సాయంకాలాల్లో గానసభలు గానీ, విద్వద్గోష్ఠులు గానీ జరుపబడేవి. స్వామి అనుగ్రహానికై కొమ్ములు తిరిగిన సంగీత విద్వాంసులూ, పండితులూ ఆత్ర పడేవారు. దర్శకత్వానికీ లేదా ప్రోత్సాహాని కోసం ఎందరెందరో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, అధికార వర్గము, కళాశాలా ఆచార్య వర్యులు స్వామి దర్శనం చేసుకొనేవారు. ఇతర మతానుయాయులు ''వారి వారి మత సిద్ధాంతాల్లోనూ, విశ్వాసాల్లోనూ స్వామివారికి గట్టి పరిచయం వుందనీ, ఏ రకానికీ ఏ స్థాయికి చెందినవారైనా వారి ఆధ్యాత్మిక కృషిని మెచ్చుకొనేవారనీ'' - స్వామివారిని పొగడేవారు.

ఇంతెందుకు, స్వామి సాంగత్యం కల ఎవరైనాసరే వారిని జగద్గురువుగా గణించి తీరేవారు.

సంపూర్ణ భారత యాత్ర (1919-1939)

మన పవిత్ర భరతఖండంలో ఆచార్యస్వామి పర్యటన 1919 మార్చిలో మొదలైంది. సుమారు 20 సంవత్సరాలకు పైగా సాగిన, ప్రయాస బహుళ##మైన ఈ పర్యటన యావద్భారత ప్రజానీకానికి స్వామి దర్శనాన్ని, అశీః కటాక్షాలను పొందే అదృష్టాన్ని కల్గించి పరమ ప్రయోజనకారి అయింది. అధునాతన ప్రయాణ సౌకర్యాలను యేమాత్రమూ వుపయోగించకుండా చాలావరకు పాదయాత్ర చేస్తూ తప్పనిసరి అయినప్పుడు మాత్రమే 'మేనా'ను వాడేవారు. మఠోద్యుగులు, పండితులు, వేదాధ్యయనపరులు, పరిచారికా గణము, ఒంటెలు, ఏనుగులు, గోవులు మొదలగునవి కూడా స్వామి ననుసరించి వుంటాయి. స్వామివారు కాలూనిన కుగ్రామమైనా నేల యీనినట్లు నేత్ర పర్వమయ్యేది. పవిత్ర శివక్షేత్రంగా రూపు దిద్దు కొనేది.

నిత్యానుష్ఠాన, పీఠపూజాదిక విధి నిర్వహణముతోపాలు, భక్తజనాదరణ, అభ్యాగత సమ్మానము దయతో నెరవేర్చేవారు. మఠ నిర్వహణాధికారులకు, మత ప్రజాభ్యుదయ సంస్థలకు సలహాలిచ్చుట స్వామివారి దిన చర్యలలో ముఖ్యమైనది. రోజుకు ఏ రెండు మూడు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకునేవారు. అనుదినమూ పెరిగెడి పని యొత్తిడిలో విసుగూ విరామం లేకుండా స్వామి ప్రసన్నమూర్తితో ప్రతి విషయము సావధానముగా సంపూర్ణముగా విచారింపగల్గుట అద్భుతావహమైనట్టిది. ఆత్మోన్నతి గల స్వామివారు స్థితప్రజ్ఞులనుట నిర్వివాదాంశము.

వెప్పత్తూరులో చాతుర్మాస్యం

1919లో కుంభకోణానికి తూర్పున 5 మైళ్ల దూరంలోని వెప్పత్తూరులో చాతుర్మాస్యవ్రతం జరిపారు స్వామి. ఈ వ్రతం వర్షాకాలంలో జరుపబడుతుంది. ఆ సమయంలో భూమిపై సంచరించే క్రిమి కీటకాదులకు గానిండు, మరే యితర ప్రాణికి గానిండు జీవహింస జరుగుతుందనే భయంతో సన్యాసులు పాదచలనం లేక నిలకడగా ఒకేచోట వుంటారు. ఆషాడ పూర్ణిమ అంటే వ్యాసపూర్ణిమనుండి రెండు మాసాల పాటు సన్యాసులు ఒకే ప్రదేశంలో వుండాలి.

1920లో చాతుర్మాస్యం మాయవరంలో జరిగింది. స్వామి యిచ్చటనున్న ఒక రోజు ఒక మహమ్మదీయ వృద్ధు స్వామి దర్శనం కోరుకుంటాడు. అనుజ్ఞ దొరకగానే అతని ఆనందానికి మేరలేదు. స్వామి ఆదేశానుసారం ఆ ముసల్మాను- ఇస్లాం మత సిద్ధాంతాలను అచటి శ్రోతలకు వివరించారు. తర్వాత సెలవుగైకొని వెళ్తూ 'స్వామి సాక్షాత్తు భగవంతుడే' అన్నాడు.

స్వామి తంజావూరు జిల్లాలో పల్లెపల్లెకూ సంచరించే దినాలలో ఒకనాడు 200 మంది హరిజనులు స్నానాలుచేసిన, శుభ్ర వస్త్రాలు ధరించి, ఫాలభాగాల్లో విభూతి రేఖలు తీర్చి స్వామి దర్శనార్థం వేచివున్నారు. స్వామి ప్రసన్నులై వారి యోగక్షేమాలు విచారించి అందరికీ నూతన వస్త్రాలు బహూకరించారు. స్వామియాత్రలలో ఇట్టి వెన్నో చెప్పలేము. ప్రజానీకమన్న వారి కంతులేని దయ. పిమ్మట రామేశ్వరాన్ని దర్శించి సైతం స్వీకరించారు. రామనాథపురం, మధుర, తిరునల్వేలి జిల్లాలలో పర్యటించి స్వామి జంబుకేశ్వరం (తిరువానైక్కావల్‌) చేరారు. ఉగ్రరూపిణియైన అఖిలాండేశ్వరికి ఆదిశంకరులు శ్రీ చక్ర తాటంకా లమర్చి ప్రసన్న మూర్తిని చేశారట. అప్పటి నుంచి ఆ బాధ్యత కామకోటి పీఠానిదే అయింది. 1846 లో ఒకసారి తాటంక పునరలంకరణ జరిగింది. 1923లో మరలా అలంకరించడం కోసం స్వామివారు వేంచేశారు. ఆలయ జీర్ణోద్ధరణ అనంతరం కుంభాభిషేకం జరిపించారు. ఇక్కడి శంకర మఠంలోనే తన ఉపనయనం జరిగినట్లు ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీరు, మేధావి సర్‌. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1923లో తిరుచ్చిలో జరిగిన ఒక సభలో వాకొన్నారు.

అక్కడనుండి శ్రీ సదాశివ బ్రహ్మేంద్రుల వారి అధిష్ఠానమైన నెరూరు చేరి స్వామి అచ్చటనే చాలాసేపు కూర్చుండి పోయారు. శ్రీ బ్రహ్యేంద్రుల వారు అద్వైత ప్రతిపాదకంగా ఎన్నో కీర్తనలు రచించినవారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం చెట్టినాడు, పుదుక్కోట సంస్థానాలు ఒక సంవత్సరం పాటు సందర్శించారు. అప్పట్లో స్వామి దర్శనం చేసుకున్న వారిలో ఎందరో రాజకీయ వేత్తలు, మరెందరో జాతీయ నాయకులు వున్నారు. శ్రీ చిత్తరంజన్‌ దాసు, శ్రీ ఎ. రంగస్వామి అయ్యంగార్‌, శ్రీ జమన్‌లాల్‌ బజాజ్‌, శ్రీ సి. రాజగోపాలచారి మొదలగువారు.

స్వామీజీ సన్నిధిలో మహాత్మా గాంధీ

పురుచ్చేరి ప్రయాణంలో స్వామికి ఫ్రెంచి ప్రభుత్వాధినేతలు, ప్రజలు రాచమర్యాదలతో స్వాగతమిచ్చారు. 1927 మార్చిలో స్వామి సేలం జిల్లాలో పర్యటించి, కోయంబత్తూరు మీదుగా పాలఘాటు చేరారు. ఇదే సంవత్సరం చివరిభాగంలో దక్షిణ దేశ పర్యటన చేస్తున్న మాహాత్మాగాంధీ స్వామివారి మాహాత్మ్యాన్ని విని వారిని చూడాలని 'నెల్లి చెరి'లో కలుసుకున్నారు. స్వామి బస చేసిన చోట వుండే గొడ్లచావిడిలో వీరి సమావేశం. శాంతికి చిహ్నమైన ఖద్దరు కాషాయాంబరాలను ధరించి పీఠాధిపతి అయినప్పటికీ వట్టి నేలపై కూర్చున్నారు. మహాత్ముడు హిందీలోనూ, స్వామి సంస్కృతంలోనూ మాట్లాడుకున్నారు. 'ఈ అద్వితీయ సమావేశం బహుళ ప్రయోజనకారి' అంటూ మహాత్మా గాంధీ తమ తృప్తిని వెలిబుచ్చారు. ఇక్క డొక సంఘటన జరిగింది. స్వామి పట్ల మహాత్ము డెంతగా ఆకర్షితుడయ్యాడో మనం గ్రహించవచ్చు.

గాంధీగారు సాయంకాలం 6 గంటల తర్వాత భోజనం చెయ్యరు. అప్పటి కైదున్నర గంటలయింది. అందుచే చక్రవర్తి రాజగోపాలాచారి గారు మహాత్మునితో సాయంకాల భోజనవేళ దాటి పోగలదని గుర్తు చేశారు. దీనిపై మహాత్మాజీ 'ఆచార్య స్వామితో జరుపు సంభాషణ తన కా నాటి భోజనమ'ని చెప్పారు.

కేరళ పర్యటనం

కేరళలో గురువాయూర్‌, తిరుచూర్‌, ఎర్నాకుళం, క్విలన్‌, త్రివేండ్రంలతో సహా స్వామి చాలా ప్రదేశాలను సందర్శించారు. కొచ్చిన్‌, తిరువాన్కూరు సంస్థానాలు స్వామి వారికి విశేష భక్తిగౌరవాలను ప్రకటించాయి. కన్యాకుమారి వెళ్ళి సాగర సంగమంలో పవిత్ర స్నానమైన తర్వాత శ్రీ స్వామి ఉత్తరదేశ యాత్రకు బయలుదేరారు. సుప్రసిద్ధ నాయకులు సర్‌. తేజ్‌ బహద్దూర్‌ సఫ్రూ స్వామిని మధురలో సందర్శించారు. 1929లో దక్షిణార్కాటు జిల్లా మీదుగా పయనించి 'మనల్పూరు'లో చాతుర్మాస్యం చేశారు. ఒక్కనెల పాటు జ్వర పీడితులైనా లెక్క చెయ్యక నిత్య స్నానానంతరం దైనందిన పూజా కార్యాలు జరిపేవారు.

తిరువణ్ణామలై దీప దర్శనం

1929 డిసెంబరులో స్వామి తిరువణ్ణామలై దీప దర్శనానికి వెళ్ళారు. ఇది పవిత్ర యాత్రా స్థలం. ఇచటి అరుణాచలాన్నే శివలింగంగా భావించి అర్చిస్తారు. కుమ్మరి చక్రాకారం గల భూమికి ఈ అరుణాచలం ఇరుసు లాంటిదనీ, దీన్ని ఆధారంగా భూచక్రం తిరుగుతోందనీ స్కాంద పురాణం వర్ణించింది. అరుణగిరినాధర్‌ రమణమహర్షి. తెలుగులో సుప్రసిద్ధ రచయిత చలం వంటి మహానుభావులు ఇక్కడే సిద్ధిపొందారు. సంవత్సరానికోసారి కార్తీక పూర్ణిమ నాటి సాయంకాలం ఈ కొండ శిఖరాన అఖండజ్యోతి వెలిగిస్తారు. దీనికే దీప మహోత్సవమని పేరు. ఆ కొండకు ప్రదక్షిణం చేస్తూ, అరుణాచల శివుణ్ణి అర్చిస్తూ అక్కడే ఒక నెల పాటు గడిపారు శ్రీ స్వామి. తర్వాత అప్పయ దీక్షితుల స్వస్థలమైన 'ఆడయ పాళెం' సందర్శించారు. 1930 డిసెంబరులో పక్షితీర్థంలో యావద్భారత సాధు సంఘ పక్షాన స్వామివారికి ఆఖండ స్వాగతం లభించింది.

స్వామి సన్నిధిలో పాల్‌ బ్రంటన్‌

1931 జనవరిలో స్వామివారు చెంగల్పట్టు చేరారు. విశ్వవిఖ్యాత బ్రిటిష్‌ పత్రికారచయిత పాల్‌బ్రంటన్‌ స్వామిని ఇక్కడే దర్శించి, తమ గ్రంథంలో ఇలా వ్రాశారు.

''విభూతి నలదిన ఆ స్వామివారి చామనచయ ముఖము నా సువిశాల చిత్త చిత్రపట వీధిలో పూజనీయమైన ఉన్నత స్థానంలో నిల్పబడింది. వారిలో నేదో దివ్యతేజస్సు నా కన్నులకు గట్టినది. వారు మర్యాదగా మాట్లాడుతారు. ఆ నల్లని విశాల నేత్రాలు నిశ్చల మనోహరాలు. చిన్నగా సూటిగా నున్న ముక్కు, కొలదిగా పెరిగిన గడ్డమూ, ఆకర్షణీయమైన నోరు చూస్తుంటే ఇంకా ఇంకా ఆకర్షణీయంగా వుంది. ఇట్టి ముఖ కవళికలు మధ్య యుగంలో క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని అలంకరించిన ఒక యోగికి వున్నాయనుకుంటాను. కానీ ఆయన కీ మేధాశక్తి లేదు. అర్థ నిమీలితములైన ఆ కను రెప్పల మాటున స్వప్నానుభూతి - కాదు సత్యానుభూతియే - అని అనిర్వచనీయానుభవాన్ని పొందాను'' అన్న బ్రంటన్‌ స్వామి ఆదేశానుసారం తిరువణ్ణామలై వెళ్ళి శ్రీ రమణమహర్షిని దర్శిస్తారు.

పీఠాధిపతిగా కాంచీ పురాగమనం

1931 జనవరి 25, ఆదివారం నాడు కన్నుల పండువుగా అలంకరించిన కాంచీ నగరాన్ని స్వామి విధ్యుక్తంగా ప్రవేశించారు. పౌరులు మహోత్సాహంతో సభక్తికంగా స్వాగతమిచ్చారు. పరమ రమణీయములైన దేవళములతో నొప్పారు నట్టిది కంచి. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం దీనికి నడిబొడ్డు. ఆదిశంకరులు శ్రీ చక్రాన్ని స్వయంగా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. లోపలి ప్రాకారంలో మనుష్యుని యెత్తు శంకరుల విగ్రహం వుంది. ఆదిశంకరులు సర్వజ్ఞ పీఠా న్నధిష్ఠించి, కంచిలోనే సిద్ధి నందారు. ఈ దేవాలయపు యాజమాన్యం కామకోటి పీఠానిదే. స్వామి కంచిలోనున్న కాలంలో ఈ దేవాలయ పునరుద్ధరణకు, నిత్యార్చనకు ఏర్పాట్లు చేశారు.

చిత్తూరులో చాతుర్మాస్యం

1931వ సంవత్సరపు చాతుర్మాస్యం చిత్తూరులో జరిగినది. ఆనంతరం స్వామి ఆరణి మీదుగా 1932 మార్చిలో శ్రీ కాళహస్తి చేరారు. అది మహా శివరాత్రి పుణ్య పర్వం. సుమారు 32 మైళ్ళ దూరం కాలిబాట వెంట స్వామి కైలాసగిరికి ప్రదక్షిణం చేశారు. అక్కడనుండి తిరుపతి, తిరుమల సందర్శించారు. ప్రతి సాయం వేళలోనూ స్వామి కమ్మని తెనుగున గంభీరోపన్యాసా లిచ్చేవారు. అక్కడ నుండి వెంకటగిరి మీదుగా నగరి దగ్గరి గల సహజ సుందరమైన బుగ్గ క్షేత్రాన్ని చేరుకొని చాతుర్మాస్యం చేస్తారు. అప్పుడే శిథిలావస్థలో వున్న కాశీ విశ్వనాథ, ప్రయాగ మాధవ దేవాలయాన్ని పునరుద్ధరించి కుంభాభిషేకం జరిపించారు.

మద్రాసు రాక

తిరుత్తణిలో శ్రీసుబ్రహ్మణ్యశ్వరుని దర్శించి 1938 సెప్టెంబర్‌ 28వ తేదీ స్వామి మద్రాసు నగరంలో కాలూనారు. అశేష ప్రజావాహిని వీరికి అఖండ స్వాగతం పలికింది. మదరాసు సంస్కృత కళాశాలలో వీరికి విడిది యేర్పాటు చేయబడినది. అక్కడే నవ రాత్ర్యుత్సవాలు వైభవంగా జరుపబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలాల్లో ఉపన్యాస సందేశాల నిచ్చేవారు శ్రీ స్వామి. వారి యుపన్యాస మొక సమ్మోహనాస్త్రం. స్వామి కొంతసేపు మౌనముద్రలో నుండి మెల్లగా మాట్లాడ నుపక్రమించేవారు. అది యుపన్యాసమా! కాదు, హృదంతరము నుండి వచ్చు సందేశ వాహిని, నిర్దుష్టమైన, నిరాడంబరమైన, నిస్వార్థమైన దివ్య జీవనాన్ని అవలంబించుడని నచ్చ జెప్పేవారు. సభలకు రాలేనివారు ఆయా నాటి సభా విశేషాలను, స్వామివారి సందేశాలను హిందూ మొదలగు పత్రికల్లో చదివి తనిసేవారు.

తర్వాత మద్రాసునుండి ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ గావించిన 'తిరువారియూరు' మీదుగా కుంభకోణంలో జరుగు 'మహామఖ' క్రతు మహోత్సవంలో పాల్గొనడానికి 1933 మార్చిలో చేరుకున్నారు. అక్కడే శంకర జయంతి కూడా జరిపి మే 13 న చిదంబరం చేరుకొని అక్కడి ఆలయ వ్యవహారాలను చక్కబరచారు.

శ్రీశైల సందర్శనం

1933 చాతుర్మాస్యము మరియు నవరాత్ర్యుత్సవాలు తంజావూరిలో జరిగాయి. స్వామివారు చిదంబరంలో వుండగానే కాశీకి రమ్మని ఆహ్వానం వచ్చింది. అందుకై స్వామి రోజు కిరువది మైళ్ళ చొప్పున ప్రయాణిస్తూ కర్నూలు మీదుగా శ్రీశైలం చేరారు. దీనికే దక్షిణ కైలాసమని పేరు. ఇచటి శివుడు మల్లికార్జునుడు- పార్వతి భ్రమరాంబికాదేవి.

దేశమునందలి ద్వాదశ జ్యోతిర్లింగాలలోనిది యొకటి. తిరుమలలో ఆకాశగంగ అయితే, ఇక్కడనేమో పాతాళగంగ. శ్రీశైలంలో మల్లె తీవలతో పెనవేసుకొన్న అర్జున (మద్దిచెట్టు) వృక్షం వుంది. మన స్వామి 1934 జనవరి 29న శ్రీశైల దేవాలయం చేరి తమ కిష్టమైన 'శివానందలహరి'లోని క్రింది శ్లోకంతో స్తుతించారు.

''సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిర

స్థ్సానాంత రాధిష్ఠితం

సప్రేమ భ్రమరాభిరామ

మసకృత్సద్వాసనా శోభితం

భోగీం ద్రాభరణం సమస్త సుమనః

పూజ్యం గుణా విష్కృతం

సేవే శ్రీగిరి మల్లికార్జున మహా

లింగమ్‌ శివాలింగితమ్‌.''

అక్కడనుండి 1934 ఫిబ్రవరి 12 న హైదరాబాద్‌ సంస్థానం చేరుకొన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వోద్యోగులతో కూడి జగద్గురువులను సభక్తికంగా సేవించారు. తిరిగి ఏప్రిల్‌ 24న సికింద్రాబాదు వదలి సొన్నా, బండెల్వాడల మీదుగా నాగపూరు చేరారు. అతిగహనమైన వింధ్య పర్వతాలను దాటి జబల్పూరు చేరుకొన్నారు. గంగానాథ్‌ఝావంటి మహా మహోపాధ్యాయులు స్వామి వారికి స్వాగతం పలికారు.

కాశీనగర ప్రవేశం

స్వామి రామేశ్వరనుండి తెచ్చిన ఇసుకను ప్రయాగలో 1934 జూలై 25న త్రివేణీ సంగమంలో కలిపారు. చాతుర్మాస్యానంతరం ప్రయాణించి 1934 అక్టోబరు ఆరవ తేదీ కాశీ పట్టణాన్ని చేరుకొన్నారు. కాశీ మహారాజతో పాటు పండిత మదనమోహన మాలవ్యా మొదలైన పురప్రముఖులు, అశేషప్రజానీకం స్వామికి స్వాగతమిచ్చారు. ఆనాటి వైభవాన్ని పత్రిక లీరీతిగా ఘోషించాయి. ''ఆ మహాయోగి పుంగవుని ముఖతేజో దర్శనంతో ప్రజానందానికి అవధుల్లేక పోయింది. అనంత ప్రజావాహిని మధ్య అయ్యఖండ సన్మాన మహాసభా వైభవాన్ని కాశీపట్టణం కనీ వినీ యెఱుగదు.''

కాశీనగరం శ్రీ విశాలాక్షీ విశ్వనాథుల నిలయం, ముక్తిప్రదాలైన సప్తనగరాలలో నిదియునొక్కటి, పావన గంగా స్రవంతి యిచట ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. యోగులకూ, విజ్ఞులకూ ఇది పట్టుగొమ్మ. వరుణ - అసి అనబడే రెండు నదుల మధ్య ప్రదేశం కాబట్టి దీనికి 'వారణాసి' అన్న పేరు గూడా వుంది. ఇచటి మణికర్ణికా ఘట్టంలోనే ఆదిశంకరులు భాష్య రచన చేశారు. స్వామిని జగద్గురువుగా చాటినదీ కాశీయే. 1935 ఫిబ్రవరి 9 న పండిత మదనమోహన మాలవ్యా కోర్కెపై హిందూ విశ్వ విద్యాలయానికి వెళ్ళి అచటి ఉపాధ్యాయులకూ, విద్యార్థులకూ సంస్కృతంలో ఆణిముత్యాల్లాంటి సందేశాలందిస్తారు శ్రీ స్వామి.

అక్కణ్ణుంచి పాట్నా చేరుకొని శంకర జయంతి జరిపారు. పాట్నాలో స్వామి కార్యక్రమాలను, నియమనిష్ఠలను ''THE SEARCH OF LIGHT'' అన్న ఆంగ్లపత్రిక ఘనంగా శ్లాఘించింది.

ఆ పిమ్మట గయను చేరుకొని, బుద్ధ గయతో బోధి వృక్షాన్నీ, బుద్ధుని దేవళాన్నీ దర్శించారు. బీహారులో గొప్ప యాత్రాస్థలమైన వైద్యనాథ (దియోగరు) క్షేత్రాన్ని సందర్శించి శ్రీ గిరిజాదేవిని స్వయంభూలింగాన్నీ పూజించి అక్కడ చాలాసేపు ధ్యాన నిష్టులయ్యారు.

కలకత్తాలో

మధ్య మధ్యలో మజిలీలు చేసుకుంటూ 1935 జూలై 13న కలకత్తా చేరుకొన్నారు శ్రీ స్వామి. ఆ మహాపట్టణం స్వామివారి కుత్సాహ పూరితమైన స్వాగత మిచ్చింది. అక్కడే కాళీఘాట్‌లో చాతుర్మాస్యం జరిపారు. అక్కణ్ణుండి మిడ్నపూరు మీదుగా ఖరగ్‌పూరు చేరారు. పిమ్మట తాతా నగర్‌, మయూర్‌భంజ్‌లను చూచుకొని ఒరిస్సాలోని కటక్‌ చేరుకొన్నారు. అక్కడే శంకరజయంతి జరిగింది. సాక్షి గోపాలమును దర్శించి పిమ్మట పూరీ జగన్నాథస్వామిని పూజించారు. చిలక సరస్సు మీదుగా బెర్హంపూరు వెళ్ళి చాతుర్మాస్యం చేశారు. ఆతదుపరి 1936 అక్టోబరులో విజయనగరం చేరుకొని నవ రాత్ర్యుత్సవాలు జరిపారు.

సింహాచల క్షేత్ర సందర్శనం

అక్కడనుండి మనోహరమైన సింహాద్రిపై వరాహస్వామి నెలకొనియున్న సింహాచల క్షేత్రాన్ని 1936 అక్టోబర్‌ 4న దర్శించి , అచటి గంగా ధారా జలపాత సమీపంలో కొంతసేపు ధ్యానం చేశారు. విశాఖపట్టణం మీదుగా పాలకొల్లు చేరి చాతుర్మాస్యం జరిపి రాజమండ్రి, కాకినాడలను చూచుకొని కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల మీదుగా పర్యటించి విజయవాడ చేరుకుంటారు. అక్కడ గొప్పగా పండిత సభ జరిపిస్తారు శ్రీ స్వామి. నెల్లూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి-ల మీదుగా 1939 ఏప్రిలులో చిత్తూరు జిల్లాలోని నగరి చేరుకొని 'బుగ్గ' క్షేత్రంలో శంకరజయంతి చేస్తారు.

రామేశ్వర పునరాగమనం

తిరుత్తణి, కంచి, చిదంబరముల మీదుగా రామేశ్వరం వెళ్ళి అచ్చట రామనాథ స్వామికి త్రివేణీ సంగమం తెచ్చిన గంగతో అభిషేకించారు. మునుపటి రాకలో ఇక్కడ తీసుకున్న ఇసుకను స్వామి ప్రయాగలో శాస్త్రోక్తంగా త్రివేణి సంగమంలో కలిపారు. దీనితో స్వామి వారి గంగా యాత్ర పరిపూర్ణమయింది. మరునాటి నుండి ఆరు మాసాలు మౌనం వహించారు. అయినా యాత్ర మానకుండా 21 సంవత్సరాలుగా సాగిస్తున్న ప్రథమ విజయయాత్రను ముగించుకొని 1939 జూన్‌ 29న కుంభకోణం చేరుకొన్నారు.

ఇంతటితో ఆగకుండా ఎన్నో దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకాలు జరిపించారు. రెండో ప్రపంచ యుద్ధ దుష్ఫలితాలు ప్రజలపై ప్రభావం చూపకుండా అన్ని దేవాలయాల్లోనూ రుద్రాభిషేక, రుద్ర సహస్ర, విష్ణు సహస్రనామ పారాయణములను జరుపవలెనని 1942 లో స్వామివారు సూచించిన మేరకు ప్రభుత్వమువారు అట్లే జరిపించారు. అదే సంవత్సరమున స్వామి 'పూవనూరు'లో అతి రుద్రయాగం జరిపించారు.

వేదోద్ధరణం

హిందువులకు వేదం మూలగ్రంథం. నానాటికీ క్షీణిస్తున్న వీటిని పరిరక్షించడానికై దేశం నలుమూలలనుండి పండితుల్ని పిలిపించి 1944లో 'వేషధర్మ పరిపాలన' సభను ప్రారంభించారు శ్రీ స్వామి. మరల 1955 లో గూడా ప్రముఖ వేదపండిత సమ్మేళనం ఏర్పాటు చేశారు. అద్వైత వ్యాప్తికి అనంత కృషి సల్పారు. ఎన్నో ఉపన్యాసాలిచ్చారు. వారి ఉపన్యాసాలు ఓపిగ్గా వ్రాసుకుంటే ఉదాత్తమైన పరిశోధన గ్రంథాలవుతాయి.

ఆర్ష ధర్మ సముద్ధరణంలో వీరి కృషికి ఫలరూపం 1962లో రూపొందిన అఖిల వ్యాస భరతాగమ శిల్ప సదస్సు. ఇది చాతుర్మాస్య కాలమున 'ఇలయాత్తం గుడి'లో జరిగింది. రోజు రోజుకూ అంతరించి పోతున్న కళలను, కర్మ కాండలను, దేవతార్చ నాదులను గూర్చి చర్చించి, సమన్వయించి ప్రజల కందివ్వడమే దీని లక్ష్యం. 1966లో కాళహస్తిలో గూడా ఈ సదస్సు జరిగింది. ఈ విధంగా ఎన్నో సార్లు యావద్భారతాన్నీ సందర్శించారు శ్రీ స్వామి.

శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి

తనకు వారసునిగా పవిత్ర కాంచీ కామకోటి పీఠానికి అధిపతిని అన్వేషించి బాధ్యత లప్పజెప్పదలచారు స్వామి. తిరుచ్చిలో దక్షిణరైల్వే ఉద్యోగిగావున్న శ్రీ మహదేవ అయ్యర్‌గారి కుమారుడు సుబ్రహ్మణ్య నామధేయుణ్ణి ఎన్నుకొన్నారు. అప్పుడాయనకు పందొమ్మిదేండ్లు. అది 1954 మార్చి 22వ తేదీ. కొన్ని వేల మంది ఆ మహోత్సవాన్ని చూడడానికి వచ్చారు. బాలశిష్యుడు సర్వ తీర్థ పుష్కరిణిలో నడుము లోతు నిలబడి స్వామి రాగానే యజ్ఞోపవీతాన్నీ, పూర్వాశ్రమ వస్త్రాన్నీ విసర్జించాడు. గురుపాదు లొసగిన కాషాయాలు ధరించి విశ్వేశ్వరుని గుడి కేగారు. అక్కడే స్వామి, వీరికి మహా వాక్యోపదేశం చేసి 'జయేంద్ర సరస్వతి' అన్న యోగపట్టా న్నిచ్చారు. అప్పట్నుండీ వీరు శ్రీ స్వామివారి కనుచరులు. ప్రస్తుతం వీరికి వారసులుగా శ్రీశంకరానందేంద్ర సరస్వతీస్వామి నియమితులయ్యారు. పధ్నాలుగు సంవత్సరాల ఈ బాలుడు అపర ఆదిశంకరుల్లాగా దేదీప్యమానంగా వున్నారు.

ధర్మ స్వరూపులైన ఈ మువ్వురూ ప్రత్యక్ష త్రిమూర్తులు-పుంభావ గాయత్రీ సావిత్రీ సరస్వతులు. వీరిని చూచినంతనే ఎటువంటి వారికైనా హృదయ కలశాలు భక్తిరసంతో తొణికిసలాడి తీరుతాయి. వీరిని చూస్తున్నంతకాలం తామేదో అనిర్వచనీయమైన అనుభూతిని పొందినట్లు తృప్తి చెందుతారు. అదే కాంచీ పీఠానికి గల ప్రత్యేక పవిత్రత.

చివరి మాట

శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిది అఖండమైన జ్ఞాపక శక్తి. తొంభైమూడు సంవత్సరాలు పైబడినా దీనికి మాత్రం లోటు లేదు. డెబ్భైయేళ్ళ క్రితం చదివిన గ్రంథమైనా పేరూ, పుటతో సహా ఫలానా రచయిత అని కంప్యూటర్‌ మెమరీలా చెబుతారు శ్రీ స్వామి.

ఎప్పుడో బెజవాడ గోపాలరెడ్డిగారు ఉత్తరప్రదేశ్‌ గవర్నరుగా వున్నప్పుడు ప్రయాగలో గంగానది వొడ్డున శంకర విమాన మండప నిర్మాణానికి స్థలం మంజూరు చేశారట. ఇది 1968 నాటి మాట. దీన్ని రెడ్డిగారు పూర్తిగా మరచి పోయారు. ''పలువురి సహకారంతో అరవై, డెబ్భైలక్షల ఖర్చుతో మందిరం ఏర్పాటయింది. సంప్రోక్షణ కూడా అయిపోయింది. దాన్ని చూచి, అలాగే కాశీ కూడా వెళ్ళి రాండి'' అని పోయి రావడానికి ఎయిర్‌ టికెట్స్‌తోసహా అన్ని యేర్పాట్లుచేసి శిష్యుల్ని స్వయంగా నెల్లూరు పంపి డా|| రెడ్డిగార్ని ఆహ్వానించారట! ఇది ఒక్కటి చాలు స్వామివారి అసాధారణ జ్ఞాపక శక్తికీ, కృతజ్ఞతా భావానికీ నిదర్శనంగా.

స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి స్వామీజీ అంటే ప్రాణం. 1978లో జనతా ప్రభుత్వ పాలనా కాలంలో ఈమె లక్ష్యాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. అప్పట్లో ఈమె స్వామివారిని దర్శించి ''స్వామీజీ! నేను ఎన్నికల్లో పోటీ చేయదలచాను. గెలిచేట్లు ఆశీర్వదించండి'' అని కోరారట. ఆ మాట విని స్వామివారు సుమారు అరగంట పైగా మౌనం దాల్చారట. అంతవరకు మాజీ భారత ప్రధాని ఆయన యెదుట నిలిచే వుంది. ఎంతకూ జవాబు రాక పోయ్యేసరికి శ్రీమతి గాంధీ పునరాలోచించి, ''స్వామీ! నేను జీవితాంతం దేశానికి సేవ చెయ్యదలచాను - ఆశీర్వదించండి'' అనగానే తక్షణం స్వామివారు చిరుదరహాసంతో అభయహస్తం చూపారట. ఆ హస్తాన్నే తమ పార్టీ చిహ్నంగా ఇందిరాజీ నిర్ణయించుకొని అఖండ విజాయన్ని సాధించుకొన్నట్లు జన శ్రుతి.

1984లో స్వామివారు కర్ణాటక నుండి ఆంధ్ర ప్రదేశ్‌ సరిహద్దుల్లో కాలూనబోతున్న తరుణంలో గౌరవనీయ ముఖ్య మంత్రి శ్రీ నందమూరి తారక రామారావుగారు హెలికాప్టర్‌లో వెళ్ళి స్వామివారికి భక్తి ప్రపత్తులతో స్వాగతం చెప్పారు. స్వామి కరుణించి జపమాల ప్రదానం చేశారు.

సన్న్యాసం స్వీకరించిన నాటినుంచి ఈనాటి దాకా తమ జీవితంలో ఒక్క క్షణం కూడా యితరుల దృష్టినుంచి దాచుకోవలసిన రహస్యం అన్నది లేకుండా డెబ్భై ఏళ్ళ నుంచీ నియమ నిష్టలతో నిర్విరామంగా, ఎటువంటి వారికీ వ్రేలెత్తి చూపరాని స్వచ్ఛమైన జీవితం గడుపుతున్న మహా తపస్వి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామువారు. వీరిని దర్శించి భక్తిపరవశుడు కానివాడు లేడు. ఇటు సామాన్య గృహస్థు నుంచి అటు భారత ప్రధానిదాకా, ఇటుమామూలు ఛాందసుని అటు రాజా రామన్న వంటి అగ్రశ్రేణి శాస్త్రజ్ఞుల దాకా, కవులు, గాయకులు, కళాకారులు, భారత - పాశ్చాత్య పత్రికా విలేఖరులూ, రచయితలూ ఇలా అన్ని వర్గాలవారినీ కలుసుకొని, ఏభాషలో ప్రశ్నించిన వారికి అదే భాషలోనే జవాబిస్తూ వారి అపూర్వమైన మానవత్వంవల్ల, తేజస్సు వల్ల లోకాన్ని ప్రభావితం చేస్తున్నారు.

రోజూ వీరిని సందర్శింప వచ్చేవారిలో మహమ్మదీయులు, క్రిష్టియనులు, వైష్ణవులు, పార్సీవారు ఇలా యితర మతస్థులుగూడా వున్నారు. చూచిన ప్రతి ఒక్కరూ 'ఈ స్వామి - మా స్వామి' అనేటువంటి అపూర్వ భావాన్ని కల్గిస్తారు స్వామి. వీరి సంప్రదాయపు నియమ నిష్టలగురించి ఎవకైనా పేచీ వుండవచ్చునేమో గాని, ఒక మహోన్నత వ్యక్తిగా యావత్‌ ప్రపంచంలో ప్రముఖు లందరికీ వీరిని గూర్చి ఏకాభిప్రాయం వుంది. ప్రఖ్యాత రచయిత 'అర్థర్‌ కోయన్లర్‌' నుంచి గ్రీసుదేశపు రాణి దాకా పరమ పూజ్యులయ్యారు శ్రీ స్వామి.

కోట్లాది ప్రజలకు ఇంత సన్నిహితంగా వచ్చిన స్వామి మరొకరు లేరు. అందుకే ఆయన ప్రత్యక్ష దైవము.

Prathyaksha Daivamu    Chapters    Last Page